విజిల్ విజార్డ్ గురించి
 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

భారతీయ సంగీతమైనా, పాశ్చాత్య సంగీతమైనా మానవునిలో రసజ్ఞతను సృష్టించి, అతనికి అనుభూతిని కలిగించడానికి ఉద్దేశింపబడినది. ఈ రెండింటిలో కూడా భారతీయ సంగీతం భగవంతుడే సృష్టించిన కళగా సామవేదంలో పేర్కొనబడి కాలానుగుణంగా ప్రజావళికి ఆనందాన్ని ప్రసాదిస్తోంది. భక్తి దానికి ఆలంబనమై, సాహిత్యం దాని రూపమై వందలాది సంవత్సరాలుగా శాస్త్రీయ సంగీతం భారత జీవన స్రవంతిలో ఒక భాగమైంది.

ఎంత శాస్త్రీయ సంప్రదాయ సంగీతమైనా క్రొత్త క్రొత్త ప్రయోగాలను అంగీకరించి తనలో కలుపుకుని సాగిపోనిదే ప్రజారంజకం కాజాలదు. అయితే ఈ ప్రయోగం, సంగీతానికి

నూతన అలంకరణే కానీ, దాని ప్రాచీన పవిత్రతని ప్రక్రియ విధానాన్ని మార్చనంతవరకు మన ప్రయోగాలు సంగీతానికి అత్యంత పుష్టిని చేకూరుస్తాయి. అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజు స్వామి మొదలగు వాగ్గేయ కారులు ఇలాగ, ప్రయోగాత్మకంగా సంగీతాన్ని ఆరాధించి, దాని ద్వారా భగవంతుని సేవించి తరించినవారే.

ఆధునిక కాలంలో కూడా ఎందరో మహా విద్వాంసులైన సంగీత కళాకారులు సంప్రదాయ శాస్త్రీయ సంగీతంలో దాని పవిత్రతను కాపాడుతూ ఎన్నో ప్రయోగాలు చేసి, ప్రజల మన్ననలు పొందారు. ఇలాగ సంగీతాన్ని ప్రయోగాత్మకంగా అమలు పరచిన మహానీయులలో ఉత్తరాది సంగీతంలో ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, పండిట్ రామ్ నారాయణ్ (సారంగి), పండిట్ బ్రజ్ భూషణ్ కాబ్రా (గిటార్), పండిట్ శివకుమార్ శర్మ (సంతూర్),పండిట్ రవిశంకర్ (సితార్), పండిట్ విజయరాఘవ రావు(బాసురీ), పండిట్ విశ్వమోహన్ భట్ మొదలైన వారు.

దక్షిణాదిలో నాదస్వరం విద్వాన్ షేక్ చినమౌలానా, శ్రీ వలయపట్టి (డోలు), శ్రీ కదిరి గోపాల్ నాథ్ (శాక్సాఫోన్), విచిత్రవీణ శ్రీ రవికిరణ్, మాండలిన్ విద్వాన్ శీ యు. శ్రీనివాస్ మొదలైనవారు.

ఇలాగే అటు గాతంలోనూ, ఇటు వాద్య సంగీతంలో కూడా అనేక ప్రయొగాలు చేయడం శివ ప్రసాద్ వంటి వారికి స్ఫూర్తినిచ్చాయి.

గురువులు:

శివప్రసాద్ శ్రీ బిస్మిల్లా ఖాన్ గారు డా|| మంగళంపల్లి బాలమురళికృష్ణ గారు, శ్రీ ఎన్.ఎస్.శ్రీనివాసన్ గార్ల దగ్గర శిష్యరికం చేసి కచేరి సాంప్రదాయాన్ని నేర్చుకుని వాటిని ఆయన ఈలపాటల్లో తీర్చిదిద్దారు. అన్నింటికీ మించి ఆయన ఈ విధంగా కచేరీ చేసే స్థాయికి రావడానికి ఎంతో సాధన చేశారు. ప్రతిరోజూ 2, 3 గంటలు సరళి స్వరాలు దగ్గర నుంచి వర్ణాలు, కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. మహా విద్వాంసులు కీర్తనలు వినటం ఆయన దినచర్య. శివప్రసాద్ కచేరీని చూడకుండా వింటూంటే ఆయన మురళీ వాయిస్తున్నారేమోననే శంసయం తప్పక కలుగుతుంది. కానీ ఆయన మాత్రం మామూలుగా చేసే సాధన గాత్ర ప్రధానంగా అంటే గాత్ర విద్వాంసులు ఎలా ఆలాపన చేస్తారో అలాగే తాను కూడా సాధన చేస్తారంటారు.

ఈలపాటకీ, వేణువు సాంకేతికంగా పరిశీలిస్తే వేణువులో బిరకాలను ఎక్కువ తొందరగా వాయించడానికి వీలవుతుంది. కానీ ఈలపాటలో అది సాధ్యపడదు. ఇదేవిధంగా నాదస్వరంలో కూడా చేయవచ్చు. అలాగే వేణువులో యమకారం అంటే ఒక స్వరాన్ని, డబుల్, త్రిబుల్ పలికించవచ్చు. గమకాలు అన్నీ పలుకుతాయి. కానీ ఈలపాట ద్వారా శివప్రసాద్ ఉఛ్వాస, నిశ్వాసాలతో సౌండ్ ని పలికిస్తారు. తాను చేసిన ఈ సాధన ద్వారా ఆలాపన చేసేటప్పుడు, స్వరాలు పలికించేటప్పుడు బ్రేక్ రాకుండా ఉంటుందంటారు. దాని ద్వారా పూర్తి స్థాయిలో కచేరి చేయడానికి అవకాశం కలుగుతోంది. అది వినడానికి కూడా ఎంతో బావుంటుంది.

గాత్రంతో పలికే సంగతులన్నీ గలమురళిలో కూడా పలుకుతాయి. అందుచేతనే (ఈలపాట) ద్వారా వివాది అయిన మనోరంజని, వాగధీశ్వరి రాగాలను కూడా అలవోకగా పలికిస్తారు.

సంగీతానికి భగవత్కృపతో పాటుగా కఠోర సాధన అవసరం. శాస్త్రీయ సంగీతాన్ని ప్రామాణికంగా ఇటు పండితులు, పామరులు మెచ్చే విధంగా ఒక కళగా తీసుకురాగలిగారు. ముందుతరాల వారికి ఈ కళ గురించి ప్రాచుర్యం చేయడానికి ప్రముఖ వాగ్గేయకారుల రచనలను తీసుకుని సి.డి.లు, క్యాసెట్ల రూపంలో వాటిని విడుదల చేశారు. అవి ఎంతో ప్రజాదరణ పొందాయి.

 

 

 


 


Copyright © 2005-2013 Whistlewizard.com. All rights reserved  
                                                                                                                                                        Design: Agnatech